అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలు!
చంద్రబాబు నాయకత్వంపై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం.. స్థానిక ఎన్నికల్లో కూటమికి భారీ విజయాలు.. పంచాయతీ ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగురవేస్తాం: రాజేంద్రప్రసాద్..

ఉయ్యూరు రూరల్, నవంబర్ 16: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుండటంతోనే ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు భారీ విజయాలను అందించారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ఉయ్యూరు మండలంలో నూతనంగా ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఆయనను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొని తమ విజయానికి కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ నూతన ప్రజాప్రతినిధులను సత్కరించి అభినందించారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు మద్దతు పలుకుతున్నారని అన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రస్తుతం జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ కూటమి విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు రూరల్ టీడీపీ మండల అధ్యక్షుడు వెనిగళ్ల కుటుంబరావు, జెడ్పీటీసీ కంభం రమేష్, మున్సిపల్ చైర్మన్ చేదుర్తి ప్రవీణ్ కుమార్, ఎంపీపీ అభ్యర్థి వేమూరి శ్రీనివాస్, ఎంపీటీసీలు యుగబాబు, శ్రీలక్ష్మి, తోకల విజయ్, పోతిరెడ్డి, టీడీపీ నాయకులు అంజిబాబు, చిరంజీవిరెడ్డి, శరత్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.

