కార్తీక దీపాల వెలుగులో శివాలయాల శోభ!
శివనామస్మరణతో మార్మోగిన ఆలయ ప్రాంగణాలు... భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు... ప్రత్యేక పూజల్లో పాల్గొన్న టీడీపీ నాయకురాలు వరలక్ష్మి...

పాయకాపురం, నవంబర్ 16: కార్తీక సోమవారం సందర్భంగా నగరంలోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని శివయ్యను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక 86వ డివిజన్ టీడీపీ మహిళా నాయకురాలు కాకొల్లు వరలక్ష్మి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మహిళలు భక్తిశ్రద్ధలతో దీపారాధన నిర్వహించారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు చేసిన శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మార్మోగాయి. కార్తీక సోమవారం పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని శైవక్షేత్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది.

