బాలికలు భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ సర్వర్ అలీ బేగ్
దేశాయిపేట మున్సిపల్ హైస్కూల్లో శక్తి టీమ్‌తో అవగాహన కార్యక్రమం... పోక్సో చట్టం, బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరాలపై విద్యార్థినులకు అవగాహన... ఆపదలో 112.. సైబర్ మోసాలకు గురైతే 1930ను సంప్రదించాలని సూచన...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
V10TV మచిలీపట్నం (ప్రతినిధి): బాలికలు తమ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి వేధింపులు లేదా సమస్యలు ఎదురైనా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఇనగుదురు పోలీస్ స్టేషన్ ఎస్ఐ-2 సర్వర్ అలీ బేగ్ సూచించారు.
కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ఎస్ఐ-2 సర్వర్ అలీ బేగ్, శక్తి టీమ్-1 సభ్యులతో కలిసి మచిలీపట్నంలోని దేశాయిపేట మున్సిపల్ హైస్కూల్లో బాలికలకు భద్రత, చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులకు పోక్సో చట్టంలోని ముఖ్యాంశాలు, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. శక్తి యాప్ ద్వారా అందుబాటులో ఉన్న భద్రతా సేవల గురించి తెలియజేశారు.

సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల విషయంలో విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద లింకులు, సందేశాలు, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఆన్లైన్ అభ్యర్థనల విషయంలో జాగ్రత్తలు పాటించాలని వివరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో డయల్-112 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. బాలికలు తమకు ఎదురయ్యే వేధింపులను దాచిపెట్టకుండా వెంటనే విశ్వసనీయమైన పెద్దలకు లేదా పోలీసులకు తెలియజేయాలని చెప్పారు. మహిళలు, బాలికల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్ఐ సర్వర్ అలీ బేగ్ పేర్కొన్నారు.

