హెడ్ కానిస్టేబుల్‌పై దౌర్జన్యం.. యువకులకు పోలీసుల షాక్!
విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌పై యువకుల దౌర్జన్యం... కాలర్ పట్టుకుని దాడికి యత్నం.. కత్తితో బెదిరింపులు... ఇద్దరినీ అరెస్టు చేసి ప్రధాన వీధుల మీదుగా కోర్టుకు తరలించిన పోలీసులు...

శ్రీకాళహస్తి: విధుల్లో ఉన్న పోలీస్ కాలర్ పట్టుకుని దాడికి ప్రయత్నించడంతో పాటు కత్తితో బెదిరించిన ఇద్దరు యువకుల వ్యవహారం శ్రీకాళహస్తిలో కలకలం రేపింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అనంతరం వారిని పట్టణ ప్రధాన వీధుల మీదుగా నడిపించుకుంటూ తీసుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
సీన్ కట్ చేస్తే...
అభినందన సినిమాలోని ‘చుక్కలాంటి అమ్మాయి.. చక్కనైన అబ్బాయి’ పాటలో వచ్చే ‘కొత్త బట్టలు కుట్టిస్తారు.. గుర్రం సార్టు ఎక్కిస్తారు.. ఊరంతా ఊరేగిస్తారు..’ అనే సినీ గేయాన్ని తలపించేలా నిందితులను పోలీసులు పట్టణ ప్రధాన వీధుల మీదుగా నడిపించుకుంటూ తీసుకెళ్లారు.
శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ సమీపంలో ల్యాప్‌టాప్ చోరీకి గురైనట్లు డయల్-100కు సమాచారం రావడంతో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రమణయ్య ఘటనాస్థలానికి వెళ్లారు. అదే సమయంలో రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన బైక్ తాళాలను హెడ్ కానిస్టేబుల్ తీసుకోవడంతో వివాదం మొదలైనట్లు సమాచారం.
కొండమిట్టకు చెందిన జితేంద్ర, శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగడంతో పాటు ఆయన కాలర్ పట్టుకుని దాడికి ప్రయత్నించారని ఆరోపణ. అంతటితో ఆగకుండా కత్తితో బెదిరించినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
రమణయ్య ఫిర్యాదు మేరకు ఇద్దరిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి ఎదుట హాజరుపరిచారు. విచారణలో శ్రీనివాస్‌పై గతంలోనూ కేసు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేస్తూ వైరల్ కావాలనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌లో కత్తిని కొనుగోలు చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
అనంతరం నిందితులకు బేడీలు వేసి స్వర్ణముఖి వంతెన నుంచి పెళ్లి మండపం వరకు పట్టణ ప్రధాన వీధుల మీదుగా పోలీసులు నడిపించుకుంటూ తీసుకెళ్లారు. ఈ దృశ్యాలను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అనంతరం పోలీసు వాహనంలో నిందితులను సత్యవేడు కోర్టుకు తరలించి హాజరుపరిచారు.

