నిరుపేద దంపతులకు జీవనోపాధిగా తోపుడు బండి
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సత్యవతి, రంగారావు దంపతులకు వైఎన్‌ఆర్ చారిటీస్ అండ... పండ్ల వ్యాపారం చేసుకునేందుకు తోపుడు బండి అందజేత... సేవా కార్యక్రమంలో పాల్గొన్న ట్రస్ట్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్...


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
నూజివీడు, ఆగస్టు 13: ఆర్థిక ఇబ్బందులతో జీవనం సాగిస్తున్న నిరుపేద దంపతులకు స్వయం ఉపాధి కల్పించేందుకు వైఎన్‌ఆర్ చారిటీస్ ముందుకొచ్చింది. పండ్ల వ్యాపారం చేసుకునేందుకు వారికి తోపుడు బండిని అందజేసి జీవనోపాధికి అండగా నిలిచింది.
నూజివీడు నియోజకవర్గం తోటపల్లిలో నివాసం ఉంటున్న సొంగ సత్యవతి, సొంగ రంగారావు దంపతులు అమ్మ కళ్యాణ మండపం సమీపంలో పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు వైఎన్‌ఆర్ చారిటీస్ చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుని సంస్థ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్‌ను సంప్రదించారు.

వారి పరిస్థితిని తెలుసుకున్న జయప్రకాష్ వెంటనే స్పందించారు. దంపతులు ఇతరులపై ఆధారపడకుండా పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగించేందుకు వీలుగా వైఎన్‌ఆర్ చారిటీస్ కార్యాలయం వద్ద తోపుడు బండిని అందజేశారు.
అవసరంలో ఉన్న వారికి తాత్కాలిక సహాయం అందించడంతో పాటు వారు స్వయం ఉపాధితో కుటుంబాన్ని పోషించుకునేలా చేయూతనివ్వడం ముఖ్యమని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. తోపుడు బండి అందించిన వైఎన్‌ఆర్ చారిటీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్‌కు సత్యవతి, రంగారావు దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.

