మంత్రి నియోజకవర్గంలో తాగునీటి కటకట
వల్లంపాడులో నాలుగు రోజులుగా తీవ్ర నీటి సమస్య.. మూడు కిలోమీటర్లు వెళ్లి నీరు తెచ్చుకుంటున్న గ్రామస్తులు... కుందూ నదిలో చుక్కనీరు లేక ఎడారిని తలపిస్తున్న పరిస్థితి.. బోరుబావి కూడా లేక అవస్థలు... ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించడం లేదని ఆరోపణ.. సమస్య పరిష్కరించాలని మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి విజ్ఞప్తి...

నంద్యాల జిల్లా: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని కోవెలకుంట్ల మండలం వల్లంపాడు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. గత నాలుగు రోజులుగా సరైన నీటి సరఫరా లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వర్షాలు ముఖం చాటేయడంతో ఆగస్టు నెలలోనే కుందూ నదిలో నీరు లేక ఎడారిని తలపిస్తున్న పరిస్థితి నెలకొంది. నది నుంచి నీరు అందకపోవడంతో విద్యుత్ మోటార్ల ద్వారా గ్రామంలోని కుళాయిలకు నీటి సరఫరా చేయడం సాధ్యం కావడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. కొద్దిపాటి నీరు సరఫరా అయినా దుర్వాసన వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో ఒక్క బోరుబావి కూడా అందుబాటులో లేకపోవడంతో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. చిన్నకొప్పెర్ల, అప్పలాపురం పెద్దమ్మ పొలిమేర ప్రాంతాలకు దాదాపు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లి ద్విచక్ర వాహనాలపై నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు.
తాగునీటికే కాకుండా పశువుల అవసరాలకు కూడా నీరు అందుబాటులో లేకపోవడంతో పాడి రైతుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. నాలుగు రోజులుగా నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి వెంటనే స్పందించి వల్లంపాడు గ్రామానికి తాత్కాలికంగా ప్రత్యామ్నాయ మార్గాల్లో తాగునీరు అందించడంతో పాటు శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

