ప్రజాసేవతోనే చిరస్థాయి గుర్తింపు
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పల్లంపల్లిలో యండ్రపల్లి కృష్ణారావు విగ్రహావిష్కరణ గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమానికి ఆయన సేవలు చిరస్మరణీయం

వీరులపాడు, ఆగస్టు 30: ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసిన ప్రజాసేవకులు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతారని ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. వీరులపాడు మండలం పల్లంపల్లి గ్రామంలో మాజీ నీటి సంఘం అధ్యక్షులు యండ్రపల్లి కృష్ణారావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆమె కూటమి నాయకులతో కలిసి పాల్గొన్నారు. కృష్ణారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధితో పాటు రైతుల సంక్షేమానికి కృష్ణారావు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రజా జీవితంలో ఆయన చూపిన సేవాభావం భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యంగా రైతులకు అవసరమైన సాగునీటి సదుపాయాల మెరుగుదలతో పాటు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నందిగామ నియోజకవర్గంలోని గ్రామాల సమస్యలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని సౌమ్య తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

