దుర్గమ్మకు స్వర్ణ జడ సమర్పణ
.11 లక్షల విలువైన బంగారు జడ సమర్పణ కుటుంబం తరఫున అందించిన చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి సన్నిధికి స్వర్ణాభరణం


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, ఆగస్టు 30: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి దుర్గగుడి పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) కుటుంబం రూ.11 లక్షల విలువైన బంగారు జడను కానుకగా సమర్పించింది. అమ్మవారి అలంకరణ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ స్వర్ణ జడను ఆదివారం ఉదయం ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ సమక్షంలో అర్చకులకు అందజేశారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు రాజగోపురం ప్రాంగణంలోని కళావేదిక వద్ద ఆలయ మర్యాదలతో కార్యక్రమం నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ స్వర్ణ జడను ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి తీసుకెళ్లారు. చైర్మన్ బొర్రా రాధాకృష్ణ కుటుంబ సభ్యులు, ఈవో వి.కె. శీనా నాయక్,

అర్చకులు, ఆలయ సిబ్బంది భక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంప్రదాయ శైలిలో స్వర్ణ జడ అమ్మవారి అలంకరణకు మరింత శోభ చేకూర్చేలా స్వర్ణ జడను సాంప్రదాయ పద్ధతిలో ప్రత్యేకంగా రూపొందించారు. లక్ష్మీదేవితో పాటు ఇతర దైవిక రూపాలు ఉట్టిపడేలా నైపుణ్యంతో తీర్చిదిద్దారు. జడ దిగువ భాగంలో ఆకుపచ్చ రంగు విలువైన రాళ్లు, ముత్యాలను పొదిగి ఆకర్షణీయంగా రూపొందించారు. ఈ స్వర్ణాభరణం విలువ సుమారు రూ.11 లక్షలు కాగా, బంగారు బరువు సుమారు 130 నుంచి 160 గ్రాముల మధ్య ఉన్నట్లు పేర్కొన్నారు. అమ్మవారిపై భక్తితో తమ కుటుంబం తరఫున ఈ స్వర్ణ జడను సమర్పించినట్లు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు.

