మొబైల్ వ్యాపారంలో అప్రమత్తతే రక్షణ!
ఫోన్ల కొనుగోలు, విక్రయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి… ఐఎంఈఐ నంబర్ల మార్పిడి, సైబర్ మోసాలపై పోలీసుల అవగాహన… సంచార్ సాథీ యాప్ వినియోగం.. సీసీ కెమెరాల ప్రాధాన్యంపై సూచనలు…

విజయవాడ, నవంబర్ 12 : మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని, సైబర్ నేరాలకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సౌత్ ఏసీపీ సీహెచ్ దొర సూచించారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు గురువారం గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లో సైబర్ నేరాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌పేట సీఐ ఎన్. దుర్గాప్రసాద్‌తో కలిసి ఏసీపీ దొర మొబైల్ షాపుల యజమానులు, మొబైల్ మరమ్మతుల సిబ్బందికి పలు అంశాలను వివరించారు. ముఖ్యంగా పాత, కొత్త మొబైల్ ఫోన్ల కొనుగోలు, విక్రయాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఐఎంఈఐ నంబర్ల టాంపరింగ్ వల్ల తలెత్తే సమస్యలు, సైబర్ నేరాల నివారణపై అవగాహన కల్పించారు. అలాగే పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడానికి, ఫోన్ల ప్రామాణికతను పరిశీలించడానికి ఉపయోగపడే సంచార్ సాథీ యాప్ సేవలను వివరించారు. దుకాణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి నిర్వహణ ప్రాధాన్యాన్ని తెలియజేశారు. మొబైల్ వ్యాపారులు, సాంకేతిక సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా సైబర్ నేరాల నియంత్రణకు సహకరించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఎన్టీఆర్ కాంప్లెక్స్‌లోని మొబైల్ దుకాణాల యజమానులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

