జగనన్న సైనికురాలిగా ప్రజాసేవలో ముందుంటా!
వైఎస్ జగన్‌ను కలిసిన 78వ డివిజన్ కార్పొరేటర్ తోపుల వరలక్ష్మి… తన విజయానికి సహకరించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు… ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని హామీ…

విజయవాడ, నవంబర్ 12: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 78వ డివిజన్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన కార్పొరేటర్ తోపుల వరలక్ష్మి గురువారం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజా శ్రీనివాసరెడ్డితో కలిసి జగన్‌ను కలిసిన ఆమె, తనకు కార్పొరేటర్‌గా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తోపుల వరలక్ష్మి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. జగనన్న సైనికురాలిగా నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తనకు రాజకీయంగా అవకాశం కల్పించిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అడుగుజాడల్లో నడుస్తూ 78వ డివిజన్ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. తనను విశ్వసించి కార్పొరేటర్‌గా గెలిపించిన డివిజన్ ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మౌలిక సదుపాయాల కల్పనతోపాటు స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అయ్యే వరకు పార్టీ కోసం అవిశ్రాంతంగా పనిచేస్తానని తోపుల వరలక్ష్మి స్పష్టం చేశారు.

