కూటమి విజయానికి ప్రజా విశ్వాసమే పునాది!
అభివృద్ధి, సంక్షేమ పాలనకు ప్రజలు పట్టం కట్టారు… చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌కు అండగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు… ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి సేవ చేయాలి: వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్…

ఉయ్యూరు, నవంబర్ 12: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు ఉన్న విశ్వాసమే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయానికి కారణమని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వై.వీ.బీ. రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కంకిపాడు మండల జడ్పీటీసీగా విజయం సాధించిన దండమూడి పూజిత, పెదవోగిరాల సెగ్మెంట్ ఎంపీటీసీగా గెలుపొందిన చాగంటి నాగలక్ష్మి గురువారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ సందర్భంగా విజేతలకు రాజేంద్రప్రసాద్ అభినందనలు తెలియజేసి వారిని ఘనంగా సన్మానించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నూతన ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. ఎన్నికల్లో విజయం సాధించడంతోనే బాధ్యత పూర్తయినట్లు కాదని, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారని తెలిపారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, భావితరాలకు మంచి భవిష్యత్తు లభిస్తుందనే నమ్మకంతోనే కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీలతో గెలిపించారని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వానికి అండగా నిలిచి ఎన్నికల్లో మద్దతు తెలిపిన రాష్ట్ర ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ చేదుర్తిపాటి ప్రవీణ్, కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి, టీడీపీ నాయకులు జంపన వీర శ్రీనివాస్, సయ్యద్ అజ్మతుల్లా, షాదీఖానా చైర్మన్, మాజీ చైర్మన్ ఖుద్దూస్, 13వ వార్డు కౌన్సిలర్ బొర్రా సుబ్బారావు, చాగంటి పోతిరెడ్డి, చలపాటి శ్రీను, జంపన నరసింహారావు, సలీం, రసూల్, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
