క్షణాల్లో స్పందన.. మహిళకు ప్రాణరక్షణ!
డయల్ 112 సమాచారంతో అప్రమత్తమైన ఇబ్రహీంపట్నం పోలీసులు… కాలువ వద్దకు చేరుకుని మహిళను రక్షించిన ఖాకీలు… పోలీసుల తక్షణ స్పందనను అభినందించిన సీపీ రాజశేఖరబాబు…

విజయవాడ, నవంబర్ 12: కుటుంబ సమస్యలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ మహిళను ఇబ్రహీంపట్నం పోలీసులు సకాలంలో స్పందించి ప్రాణాపాయం నుంచి కాపాడారు. డయల్ 112కు అందిన సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మహిళను రక్షించారు. పోలీసుల వేగవంతమైన స్పందనతో పెను విషాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం అందింది. వెంటనే డయల్ 112 కంట్రోల్ రూం సిబ్బంది ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఘటనా స్థలానికి చేరుకుని మహిళను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం మహిళతోపాటు ఆమె కుటుంబ సభ్యులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని, ఆత్మహత్య ఎలాంటి సమస్యకూ పరిష్కారం కాదని సూచించారు. అనంతరం మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనలో ఇబ్రహీంపట్నం పోలీసులు ప్రదర్శించిన సమయస్ఫూర్తిని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు అభినందించారు. ఆపద సమయంలో ప్రజలు పోలీసుల సహాయం తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సకాలంలో అందిన సమాచారం, పోలీసుల తక్షణ స్పందన ఓ మహిళ ప్రాణాలను కాపాడాయి.

