గుంటుపల్లిలో భారీ చోరీ.. 87 కాసుల బంగారం మాయం!
ఇంటి తాళాలు పగులగొట్టి బంగారు ఆభరణాల అపహరణ.. దోనేపూడి కళ్యాణి నివాసంలో దుండగుల చేతివాటం.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీసీపీ రామకృష్ణ, సీఐ సుబ్రహ్మణ్యం..

విజయవాడ, నవంబర్ 16: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో భారీ చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దోనేపూడి కళ్యాణి నివాసంలోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు సుమారు 87 కాసుల బంగారు ఆభరణాలను అపహరించినట్లు సమాచారం. భారీ మొత్తంలో బంగారం చోరీకి గురికావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చోరీ ఘటనపై సమాచారం అందుకున్న డీసీపీ రామకృష్ణ, సీఐ సుబ్రహ్మణ్యం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో చోరీ జరిగిన తీరును పరిశీలించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. దుండగులు ఇంట్లోకి ఎలా ప్రవేశించారు, చోరీకి పాల్పడిన అనంతరం ఏ మార్గంలో పరారయ్యారనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకే ఇంట్లో 87 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు సమాచారం రావడంతో గుంటుపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన చర్చనీయాంశమైంది. దుండగుల ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.

