హామీలు గుర్తుచేస్తూ.. ఆస్పత్రి ఎదుట కాంట్రాక్ట్ ఉద్యోగుల గళం
• విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా... • ఉద్యోగ భద్రతతో పాటు పర్మినెంట్ చేయాలని డిమాండ్... • సమాన పనికి సమాన వేతనం.. గ్రాస్ జీతాలు చెల్లించాలని నినాదాలు...

విజయవాడ, ఆగస్టు 29: తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు శనివారం విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు.
ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు తమను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, గ్రాస్ జీతాలు చెల్లించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు.
ఏళ్ల తరబడి సేవలందిస్తున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

