ఇంటికి సౌరశక్తి.. పల్లెకు ఆరోగ్యశక్తి
సబ్సిడీ, రుణ సదుపాయాలపై సేవా సేతు శిబిరంలో అవగాహన… నరసింహారావుపాలెంలో రూ.36 లక్షలతో ఆరోగ్య కేంద్రం ప్రారంభం… ప్రజలకు మెరుగైన సేవలే ప్రభుత్వ లక్ష్యం: విప్ తంగిరాల సౌమ్య…


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకునేందుకు సౌర ప్లాంట్లు… నరసింహారావుపాలెంలో రూ.36 లక్షలతో ఆరోగ్య కేంద్రం… ప్రజలు ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి: సౌమ్య… నందిగామ, అక్టోబరు 6: ఇంటి పైకప్పులపై సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సూచించారు. నందిగామ గాంధీ సెంటర్లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘విద్యుత్ సేవా సేతు’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రధానమంత్రి సూర్య ఘర్–ముఫ్త్ బిజ్లీ యోజన కింద అందుతున్న సబ్సిడీ, నెట్ మీటరింగ్, రుణ సదుపాయాలు, సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై అధికారులు ప్రజలకు అవగాహన

కల్పించారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలో ఈ నెల 6, 7, 8 తేదీల్లో నిర్వహిస్తున్న సేవా సేతు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. వీరులపాడు మండలం నరసింహారావుపాలెంలో 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.36 లక్షలతో నిర్మించిన నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని సౌమ్య ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. స్థానికంగానే ప్రాథమిక వైద్యం అందుబాటులోకి రావడంతో ప్రజలకు ప్రయాణ సమయం, ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు. పల్లె నుంచి పట్టణం వరకు వైద్య సేవలను మరింత మెరుగుపరుస్తామని సౌమ్య తెలిపారు.

