పారిశ్రామిక హబ్‌గా అనకాపల్లి.. దేశానికే ఆదర్శం!
బెల్లానికే కాదు.. పారిశ్రామికంగానూ అగ్రస్థానంలో నిలుస్తుందని ధీమా... . డేటా సెంటర్లతో నీళ్లు ఇంకిపోతాయంటూ అపోహలు ప్రచారం చేస్తున్నారని మండిపాటు... అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శ...

అనకాపల్లి, ఆగస్టు 22: అనకాపల్లి కేవలం బెల్లానికే కాకుండా పారిశ్రామికంగానూ రాబోయే రోజుల్లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. అనకాపల్లి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
అనకాపల్లి ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తులో కొత్త పరిశ్రమలు, భారీ ప్రాజెక్టుల రాకతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
తాను ఏ పని చేసినా విమర్శలు ఎదుర్కోవడం కొత్త కాదని సీఎం వ్యాఖ్యానించారు. డేటా సెంటర్ల ఏర్పాటుతో నీళ్లు ఇంకిపోతాయంటూ కొందరు కావాలనే ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి కార్యక్రమాలపై వాస్తవాలను తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు నిరాధార ప్రచారాలు చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు, పరిశ్రమల వల్ల యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రజలు అసత్య ప్రచారాలను గమనించాలని సూచించారు.

