వరుస చోరీలకు చెక్.. అంతరాష్ట్ర దొంగ అరెస్ట్
అంతరాష్ట్ర దొంగ ఆటకు చెక్ పెట్టిన తిరువూరు సర్కిల్ పోలీసులు... సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితుడి అరెస్ట్... 130 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి, స్కూటీ స్వాధీనం...

తిరువూరు, ఆగస్టు 22: పగలు గ్రామాల్లో రెక్కీ నిర్వహించి, తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగను తిరువూరు సర్కిల్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్, వాహనాల కదలికలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుడిని పట్టుకుని భారీ మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు, రూరల్ జోన్ డీసీపీ బి. లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో, మైలవరం ఏసీపీ పి. రామచంద్రరావు ఆధ్వర్యంలో తిరువూరు సీఐ కె. గిరిబాబు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
తిరువూరు, ఏ.కొండూరు, విస్సన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేల, ఈస్ట్–వెస్ట్ మాధవరం, చీమలపాడు, కలగర గ్రామాల్లో నమోదైన నాలుగు వరుస చోరీ కేసులను ఒకే నిందితుడే చేసినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా విజయవాడ వైఎస్సార్ కాలనీ నుంచి AP 40 KS 2882 నంబరు గల తెలుపు రంగు యాక్సెస్ స్కూటీపై బయలుదేరిన నిందితుడు పలు గ్రామాల్లో తాళం వేసిన ఇళ్లలోకి ప్రవేశించి నగదు, బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించినట్లు తేలింది.
సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడి కదలికలను గుర్తించిన పోలీసులు విస్సన్నపేట మండలం పుట్రెల గ్రామం సమీపంలో చింతల గోపాలరావు అలియాస్ గోపి (32) ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతడు వత్సవాయి మండలం పొలంపల్లి గ్రామానికి చెందినవాడిగా, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా కోదాడలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడి వద్ద నుంచి 130 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి, రూ.2,000 నగదు, చోరీలకు ఉపయోగించిన యాక్సెస్ స్కూటీ, ఇనుప రాడ్ ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన విస్సన్నపేట ఎస్సై ఎం. అర్జునరాజు, పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
ప్రజలు ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లే సమయంలో విలువైన వస్తువులను భద్రంగా ఉంచాలని, ఎక్కువ సమయం ఇల్లు ఖాళీగా ఉంటే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తిరువూరు సర్కిల్ పోలీసులు సూచించారు.

