అల్పపీడనంతో భారీ వర్షాలు.. ప్రభుత్వం అప్రమత్తం
ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఈదురుగాలులు, పిడుగుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హోంమంత్రి అనిత హెచ్చరిక

అమరావతి, సెప్టెంబరు 12: దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైంది. శనివారం, ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని హైఅలెర్ట్‌లో ఉంచినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించారు. వర్షాలతోపాటు బలమైన ఈదురుగాలులు వీచి పిడుగులు పడే ప్రమాదమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం కురిసే సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగులు, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడవద్దని హెచ్చరించారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశమున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. అల్పపీడన పరిస్థితులు, వర్షాల ప్రభావంపై సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు.

