వినాయకుడి పేరుతో వసూళ్ల దందా..?
లేబర్ కాలనీలో ఎగ్జిబిషన్ నిర్వహణపై తీవ్ర ఆరోపణలు దుకాణానికి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు విమర్శలు 15 రోజుల అనుమతితో 90 రోజుల వినియోగం.. ఎస్టేట్ విభాగం సహకారంపై అనుమానాలు

విజయవాడ, సెప్టెంబర్ 12 : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని లేబర్ కాలనీలో వినాయక చవితి వేడుకల పేరుతో నగరపాలక సంస్థకు చెందిన స్థలాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ఒక్కో దుకాణానికి రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేస్తున్నారని, పార్కింగ్ పేరుతోనూ అదనపు వసూళ్లకు సిద్ధమయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. వినాయక చవితి నిర్వహణ కోసం కేవలం 15 రోజులకు స్థలాన్ని అద్దెకు తీసుకున్నప్పటికీ దాదాపు 90 రోజులపాటు వినియోగిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారానికి రాజకీయ అండదండలతోపాటు నగరపాలక సంస్థ ఎస్టేట్ విభాగంలోని కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వీటిపై సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాల్సి ఉంది. వేడుకలకు తాము వ్యతిరేకం కాదని, దేవుడి పేరుతో ప్రభుత్వ స్థలంలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడాన్నే ప్రశ్నిస్తున్నామని స్థానికులు చెబుతున్నారు. ఎగ్జిబిషన్ కారణంగా పిల్లలు ఆడుకునేందుకు, పెద్దలు నడకకు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నారు. స్థలం కేటాయింపు, అద్దె చెల్లింపులు, అనుమతి కాలపరిమితి, దుకాణాలు–పార్కింగ్ వసూళ్లపై నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని కోరుతున్నారు.

