‘వాటర్ మ్యాన్ కాదు.. బటర్ మ్యాన్’
కూటమి ప్రభుత్వంపై తోలేటి శ్రీకాంత్ ఫైర్ ఎన్నికల ముందు వెన్నలాంటి మాటలు.. అధికారంలోకి రాగానే హామీలు గాలికి చేతివృత్తిదారులకు ఒక్క పనిముట్టైనా ఇచ్చారా అంటూ నిలదీత

విజయవాడ, సెప్టెంబర్ 12 : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ‘వాటర్ మ్యాన్’గా అభివర్ణించడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తోలేటి శ్రీకాంత్ విమర్శించారు. ఎన్నికల ముందు ప్రజలకు వెన్నలాంటి మాటలు చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను మరిచిపోయినందుకు ఆయనను ‘బటర్ మ్యాన్’గా పిలిస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు. జలయజ్ఞం ద్వారా రాష్ట్ర ప్రజలకు తాగు, సాగునీరు అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకే దక్కుతుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు పెరగవని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. మహిళలకు నెలకు రూ.1,500, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి అందిస్తామని చెప్పారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఒక్క చేతివృత్తిదారుడికైనా పనిముట్టు అందించారా అని ప్రశ్నించారు. సూపర్ సిక్స్తోపాటు 600కు పైగా హామీలిచ్చిన కూటమి నాయకులు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త పింఛన్ల పేరుతో మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో తగిన సమాధానం చెప్పాలని తోలేటి శ్రీకాంత్ పిలుపునిచ్చారు.

