క్వాంటం బయో వ్యాలీకి కేంద్రం చేయూత
అమరావతికి త్వరలో కేంద్ర సాంకేతిక బృందం... ‘సంజీవని’ జాతీయస్థాయి అమలుపై పరిశీలన... చంద్రబాబు దార్శనికత, నిబద్ధతపై నడ్డా ప్రశంసలు...



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
విజయవాడ, సెప్టెంబర్ 12 (ఆంధ్రప్రభ): అమరావతిలో క్వాంటం బయో వ్యాలీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సూచనలకు సానుకూలంగా స్పందించిన ఆయన, క్వాంటం బయో వ్యాలీ ప్రణాళికపై చర్చించేందుకు త్వరలో కేంద్ర సాంకేతిక బృందాన్ని అమరావతికి పంపనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సంజీవని’ కార్యక్రమం అద్భుతంగా


ఉందని, దీనిని జాతీయస్థాయిలో అమలు చేసే అంశాన్ని పరిశీలిస్తామని నడ్డా చెప్పారు. ‘వంటగదే ఔషధశాల–ఆహారమే ఔషధం’ అనే చంద్రబాబు అభిప్రాయాన్ని ప్రస్తావిస్తూ ఆరోగ్య పరిరక్షణకు ఇదే మూలసూత్రమన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సురక్షితమైన చేతుల్లో ఉందని, రాష్ట్రాభివృద్ధిలో ఆయన పాత్ర మరువలేనిదని కొనియాడారు. పోలవరం ఎడమ కాలువ, వెలిగొండ, హంద్రీ–నీవా ప్రాజెక్టులపై ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధిని ప్రశంసించారు.

