శివనామస్మరణతో మార్మోగిన శైవ క్షేత్రాలు!
కార్తీక సోమవారం సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తజనం... అమరావతిలో నదీ స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు... కోటప్పకొండలో త్రికోటేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు...

అమరావతి, నవంబర్ 16 : కార్తీక సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తజనంతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో శివనామస్మరణ మార్మోగింది. అమరావతిలోని ప్రసిద్ధ అమరేశ్వరస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. హరహర మహాదేవ, ఓం నమఃశివాయ నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. మరోవైపు పల్నాడు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు కోటయ్యను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక సోమవారం కావడంతో శైవ క్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి.

