ఉద్యోగాలే అజెండాగా నెల్లూరులో డీవైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు
సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో నిర్వహణ.. జయప్రదం చేయాలని యువతకు పిలుపు ఖాళీ పోస్టుల భర్తీ, వయోపరిమితి పెంపు కోసం పోరాటం: డీవైఎఫ్ఐ స్థానిక పరిశ్రమల్లో యువతకు 75 శాతం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్

విజయవాడ, ఆగస్టు 25: యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే ప్రధాన అజెండాగా సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో నెల్లూరులో నిర్వహించనున్న డీవైఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర కమిటీ యువతకు పిలుపునిచ్చింది. విజయవాడ బాలోత్సవ భవన్లో మంగళవారం డీవైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వై. రాము, జి. రామన్న మాట్లాడుతూ యువజన సమస్యలు, నిరుద్యోగం, ఉపాధి అవకాశాలపై రాష్ట్ర మహాసభల్లో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో కేవలం 10,060 పోస్టులు ఉండటం నిరుద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందని వారు విమర్శించారు. పాదయాత్ర సమయంలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు మెగా డీఎస్సీ మినహా ఆశించిన స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాలేదని ఆరోపించారు. నిరుద్యోగ భృతిపైనా స్పష్టత లేదన్నారు. ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను 11,639కు పెంచాలని, డీఎస్సీ పోస్టులను మరింత పెంచాలని డిమాండ్ చేశారు. క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు రాకపోవడంతో ఉద్యోగార్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పరిశ్రమల ఏర్పాటు పేరుతో పెద్ద కార్పొరేట్ సంస్థలకు వేల ఎకరాల భూములు కేటాయిస్తున్నప్పటికీ స్థానిక యువతకు తగిన ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానిక యువతకే కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన హామీల అమలు, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీ, యువతను నాశనం చేస్తున్న డ్రగ్స్, గంజాయి మాఫియా నిర్మూలన తదితర అంశాలపై రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేపడతామని ప్రకటించారు. యువత హక్కులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై నెల్లూరు రాష్ట్ర మహాసభల వేదికగా విస్తృతంగా చర్చిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో డీవైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వీరనాల శివకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేఎఫ్ బాబు, రాష్ట్ర కమిటీ సభ్యులు నరసింహ, అబ్దుల్లా, రాఘవేంద్ర, చిన్ని, శివ, పిచ్చయ్య, కృష్ణకాంత్, అంజనేయరాజు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

