రూ.100 కోట్లతో గన్నవరం అభివృద్ధికి కొత్త ఊపు
మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రతి మూడు నెలలకు అధికారులతో శాఖలవారీగా సమీక్ష ప్రజాదర్బార్ల ద్వారా 11,200 ఫిర్యాదులకు పరిష్కారం


1 / 2 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గన్నవరం, ఆగస్టు 25: గన్నవరం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ప్రజా సమస్యలు పెండింగ్‌లో ఉండకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. గన్నవరం ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం విద్య, వైద్యం, నీటిపారుదల, పంచాయతీరాజ్, రెవెన్యూ, విద్యుత్, ఆర్అండ్బీ తదితర శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. శాఖలవారీగా పెండింగ్ పనులు, ప్రజా సమస్యల పరిష్కారం, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ అమెరికా పర్యటన, అసెంబ్లీ సమావేశాల కారణంగా ఈసారి సమీక్ష ఆలస్యమైందని, ఇకపై క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించి పనుల పురోగతిని పర్యవేక్షిస్తామని తెలిపారు. నియోజకవర్గంలో అధికారులు అంకితభావంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు. ప్రజాదర్బార్ల ద్వారా ఇప్పటివరకు సుమారు 11,200 ప్రజా ఫిర్యాదులను పరిష్కరించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన తొలినాళ్లలో ఒక్కరోజే వెయ్యికి పైగా దరఖాస్తులు వచ్చేవని, ప్రస్తుతం అవి 200 నుంచి 300కు తగ్గడం సమస్యల పరిష్కారంలో వచ్చిన మార్పుకు నిదర్శనమన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా అధికారులు గ్రామాల్లోనే సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు. గన్నవరం పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కోనాయ చెరువు నుంచి పైప్‌లైన్ ఏర్పాటుకు రూ.5 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ పనులు పూర్తయితే పట్టణ ప్రజల

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని యార్లగడ్డ తెలిపారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వీధి దీపాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. రెండు విద్యుత్ స్తంభాల మధ్య వెలుతురు లేని ప్రాంతాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్డీఎస్ఎస్ పథకం కింద ప్రస్తుతం ఆరు గ్రామాల్లో పనులు జరుగుతున్నాయని, మిగిలిన పంచాయతీలకు కూడా విస్తరించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. దావాజీగూడెం రహదారి విస్తరణ పనుల్లో జాప్యంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి మరో 15 నుంచి 20 రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులు, ప్రజల అవసరాలకు ప్రాధాన్యమిస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి గన్నవరాన్ని ఆదర్శ నియోజకవర్గంగా నిలబెట్టాలని సూచించారు. అనంతరం ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, రెవెన్యూ సేవల్లో విశిష్ట పనితీరుతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రశంసాపత్రం అందుకున్న గన్నవరం తహసీల్దార్ కె.వి. శివయ్యను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో గన్నవరం మండల పార్టీ అధ్యక్షుడు గూడపాటి తులసీమోహన్, టీడీపీ సీనియర్ నాయకులు దొంతు చిన్నా, కాసర్నేని రంగబాబు, ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ కొమ్మరాజు సుధీర్, బీబీ గూడెం పీఏసీఎస్ చైర్మన్ బోయపాటి మురళీకృష్ణ (బుల్లియ్య), వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

