ప్రైవేటు ఖర్చుకు చెక్.. ప్రభుత్వాసుపత్రిలో ఉచిత సిటీ స్కాన్
రూ.1.85 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అత్యాధునిక సిటీ స్కాన్ సెంటర్ ప్రారంభం రూ.76.60 లక్షలతో సోలార్ పవర్ సిస్టం.. నెలకు రూ.2 లక్షల విద్యుత్ ఖర్చు ఆదా త్వరలో డయాలసిస్, ట్రోమా కేర్ సెంటర్లు.. జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధే లక్ష్యం



1 / 3 చిత్రాలను పక్కకు స్వైప్ చేయండి
గుడివాడ, ఆగస్టు 25: గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య, మౌలిక వసతుల కల్పనలో మరో ముందడుగు పడింది. రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎస్ఆర్ నిధులతో రూ.1.85 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ సెంటర్‌తో పాటు రూ.76.60 లక్షలతో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ సిస్టంను ఎంపీ వల్లభనేని బాలసౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి హాజరైన ఎంపీ బాలసౌరి, ఎమ్మెల్యే రాముకు కూటమి నాయకులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించారు. అనంతరం అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించిన ఎంపీ, ఎమ్మెల్యే సిటీ స్కాన్ సెంటర్, సోలార్ పవర్ సిస్టంను పరిశీలించారు. సిటీ స్కాన్ యంత్రం పనితీరు, రోగులకు అందుబాటులోకి వచ్చే సేవల గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వల్లభనేని బాలసౌరి మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యాన్ని మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ముఖ్యంగా ప్రమాదాల సమయంలో అత్యవసరంగా అవసరమయ్యే సిటీ స్కాన్ సేవలు ఇకపై గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందుబాటులో ఉండటం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.3 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చయ్యే సిటీ స్కాన్ పరీక్షలను ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు ఉచితంగా అందించే అవకాశం ఏర్పడిందన్నారు. పెద్ద ఆసుపత్రుల్లో ఉండే స్థాయి సిటీ స్కాన్ పరికరాన్ని గుడివాడలో ఏర్పాటు చేశామని తెలిపారు. వైద్యులు, సిబ్బంది ఈ సదుపాయాన్ని సమర్థంగా వినియోగించి రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సోలార్ పవర్ సిస్టం ఏర్పాటు ద్వారా ఆసుపత్రికి ప్రతి నెల సుమారు రూ.2 లక్షల విద్యుత్ ఖర్చు ఆదా అవుతుందని బాలసౌరి తెలిపారు. ఆదా అయ్యే మొత్తాన్ని ఆసుపత్రిలో ఇతర అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. త్వరలో డయాలసిస్, ట్రోమా కేర్ గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో డయాలసిస్ సెంటర్, ట్రోమా కేర్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు అంచనాలు సిద్ధం చేస్తున్నామని ఎంపీ వెల్లడించారు. సీఎస్ఆర్ నిధులతో ఈ రెండు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రమాదాలు, అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం పేద కుటుంబాలు


ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే అవసరమైన వైద్య సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గుడివాడలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ఫ్లైఓవర్ పనులు తుదిదశకు చేరుకున్నాయని ఎంపీ తెలిపారు. రైల్వే గేట్ల వద్ద చేపట్టాల్సిన పనుల కారణంగా కొంత ఆలస్యం జరుగుతోందన్నారు. ప్రధాన రహదారుల అభివృద్ధికి రూ.24 కోట్లతో అంచనాలు రూపొందించామని, త్వరలో నిధులు మంజూరయ్యేలా ఎమ్మెల్యే రాముతో కలిసి కృషి చేస్తామని చెప్పారు. జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి: ఎమ్మెల్యే రాము ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికీ నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. గతంలో అపరిశుభ్రంగా ఉన్న ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా మార్చడంతో పాటు ఒక్కొక్కటిగా అవసరమైన మౌలిక, వైద్య సదుపాయాలను సమకూరుస్తున్నామన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి ఎంపీ బాలసౌరి అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. త్వరలో డయాలసిస్ సెంటర్‌ను కూడా కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని భవిష్యత్తులో జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే రాము స్పష్టం చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి కుటుంబ సభ్యులను వైద్యులు, సిబ్బంది ఆప్యాయంగా పలకరించి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. రూ.6 కోట్ల విరాళం.. దాత దంపతులకు సత్కారం గుడివాడ అభివృద్ధికి భారీ విరాళాలు అందించిన అన్నే నరసింహారావు, పుష్పా లీలావతి దంపతులను ఎంపీ బాలసౌరి, ఎమ్మెల్యే రాము, కూటమి నాయకులు ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి రూ.3 కోట్లు, బస్టాండ్ అభివృద్ధికి మరో రూ.3 కోట్లు కలిపి మొత్తం రూ.6 కోట్లు విరాళంగా అందించినందుకు వారిని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిరాదేవి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ గుడివాడ జోన్స్, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్‌తో పాటు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

