వినాయక మండపాల అనుమతులకు ఈ-పోర్టల్
సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్ అనుమతులు... వివిధ శాఖల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సౌకర్యం... పోలీసు శాఖ ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి...

అమరావతి: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ప్రత్యేక ఈ-పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్ ద్వారానే అవసరమైన అనుమతులు పొందేలా ఈ వ్యవస్థను రూపొందించినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
మండపాల నిర్వాహకులు వివిధ శాఖల కార్యాలయాల చుట్టూ తిరగకుండా అవసరమైన వివరాలు సమర్పించి ఒకేచోట అనుమతులు పొందే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఇందుకోసం www.ganeshutsav.net పోర్టల్‌ను వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.
వినాయక చవితి ఉత్సవాల నిర్వహణలో పారదర్శకత, వేగం, సౌలభ్యం పెంచడమే ఈ-పోర్టల్ లక్ష్యమని పోలీసు శాఖ తెలిపింది.

