అపాయం అంచున వ్యక్తి.. అండగా నిలిచిన కానిస్టేబుల్
జాతీయ రహదారి మధ్యలో కూర్చున్న వ్యక్తిని గుర్తించిన కానిస్టేబుల్... ప్రమాదం జరగకముందే స్పందించి ద్విచక్ర వాహనంపై పోలీస్ స్టేషన్కు తరలింపు... సమయస్ఫూర్తి, మానవత్వంపై పలువురి ప్రశంసలు...

నిడమానూరు: జాతీయ రహదారిపై సుమారు 55 ఏళ్ల వ్యక్తి రోడ్డు మధ్యలో కూర్చుని ఉండటాన్ని విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించారు. అతడిని వివరాలు అడిగినప్పటికీ చెప్పలేని స్థితిలో ఉండటంతో పరిస్థితిని గుర్తించిన కానిస్టేబుల్ వెంటనే స్పందించారు.
వాహనాలు వేగంగా రాకపోకలు సాగించే జాతీయ రహదారిపై అతడు అలాగే ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించి, తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని సురక్షితంగా పటమట పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రమాదం నుంచి ఓ వ్యక్తిని కాపాడేందుకు బాధ్యతకు మించి మానవత్వంతో స్పందించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ను పలువురు అభినందించారు.

