పోలీసుల పేరుతో కొత్త సైబర్ మోసం
‘కేసులో ఇరుక్కున్నారు.. వెంటనే డబ్బులు పంపండి’ అంటూ బెదిరింపులు తిరువూరులో బంగారు షాప్ యజమానిని రూ.50 వేల కోసం లక్ష్యంగా చేసుకున్న మోసగాడు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు.. ప్రజలకు ఎన్టీఆర్ పోలీసుల హెచ్చరిక...

విజయవాడ, సెప్టెంబరు 8: పోలీస్ అధికారులు, సీబీఐ, సీఐడీ, విజిలెన్స్, ఏసీబీ అధికారులమంటూ ఫోన్ చేసి డబ్బులు దోచుకునే కొత్త తరహా సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ హెచ్చరించింది. తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఓ వ్యక్తి తిరువూరు పోలీసులకు ఫోన్ చేసి తాను రాయదుర్గం ఎస్సై అని పరిచయం చేసుకున్నాడు. రాయదుర్గంలో జరిగిన మర్డర్ ఫర్ గెయిన్ కేసులో నిందితులు పట్టుబడ్డారని, విచారణలో వారు తిరువూరులోని ఓ బంగారు షాప్లో 17 గ్రాముల బంగారం తాకట్టు పెట్టినట్లు తెలిసిందని చెప్పి సహకారం కోరాడు. దీనిపై తిరువూరు పోలీసులు అవసరమైన ఆధారాలతో రావాలని సూచించారు.
అదే వ్యక్తి అనంతరం సంబంధిత బంగారు షాప్ యజమానికి ఫోన్ చేసి, నిందితులు తాకట్టు పెట్టిన బంగారం మీ వద్ద ఉందని, వెంటనే రూ.50 వేలు ఆన్లైన్లో పంపకపోతే కేసు నమోదు చేస్తామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే షాప్ యజమాని భయపడకుండా నేరుగా తిరువూరు పోలీసులను సంప్రదించడంతో మోసం బయటపడింది.
నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు ఆదేశాల మేరకు నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు కొనసాగుతోంది.
పోలీస్, సీబీఐ, సీఐడీ, విజిలెన్స్, ఏసీబీ లేదా ఇతర ప్రభుత్వ శాఖల అధికారులమంటూ ఎవరైనా ఫోన్ చేసి కేసు నుంచి తప్పించాలంటే డబ్బులు పంపాలని, లింకులపై క్లిక్ చేయాలని కోరితే నమ్మవద్దని పోలీసులు స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వ అధికారి కూడా ఫోన్ ద్వారా డబ్బులు పంపమని అడగరని గుర్తుచేశారు.
అనుమానాస్పద ఫోన్ కాల్స్, సందేశాలు వచ్చిన వెంటనే 1930 లేదా 112 నంబర్లకు సమాచారం ఇవ్వాలని, లేదా సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ప్రజలను కోరింది.

