లాడ్జిలో హత్య.. ఇద్దరి అరెస్ట్
మద్యం మత్తులో మాటామాటా.. చివరకు ప్రాణం తీసిన వివాదం... స్నేహితుడి భార్యను దూషించడంతో ఘర్షణ జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడి... సాంకేతిక ఆధారాలతో నిందితుల కదలికలపై నిఘా.. తాడేపల్లి వద్ద పట్టివేత...

విజయవాడ క్రైమ్, సెప్టెంబరు 8 : విజయవాడ పూర్ణానందంపేటలోని శ్రీ కలగ లాడ్జిలో తమిళనాడుకు చెందిన యువకుడు హత్యకు గురైన కేసును సత్యనారాయణపురం పోలీసులు ఛేదించారు. తమిళనాడులోని నార్త్ మధురై ప్రాంతానికి చెందిన పాండిదురై ముత్తు పాండియన్ హత్య కేసులో చెన్నైకి చెందిన ఎలంగో, నరేష్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరో బాల నిందితుడిని అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్‌కు తరలించారు.
పోలీసుల దర్యాప్తులో మృతుడు, నిందితులకు గతంలోనే పరిచయం ఉన్నట్లు వెల్లడైంది. పాత నేర కేసుల కారణంగా జైలులో ఉన్న సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడినట్లు సమాచారం. ఒడిశాలోని బరంపూర్ వెళ్లేందుకు చెన్నై నుంచి రైలులో బయలుదేరిన వీరు విజయవాడలో దిగి పూర్ణానందంపేటలోని లాడ్జిలో గది తీసుకున్నారు.
అక్కడ మద్యం సేవిస్తున్న సమయంలో వ్యక్తిగత విషయంపై మాటామాటా పెరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. స్నేహితుడి భార్యను ముత్తు పాండియన్ దూషించడంతో ఎలంగో ఆగ్రహానికి గురైనట్లు సమాచారం. తొలుత వివాదం సద్దుమణిగినప్పటికీ అనంతరం మరోసారి ఘర్షణ చెలరేగి ముత్తు పాండియన్‌పై దాడి జరిగినట్లు పోలీసులు గుర్తించారు. తీవ్ర గాయాలతో అతడు మృతి చెందాడు.
హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసిన సత్యనారాయణపురం పోలీసులు క్లూస్ బృందం, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుల కదలికలు, ప్రయాణ మార్గాన్ని గుర్తించారు. చివరకు గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో వారిని అదుపులోకి తీసుకున్నారు.
చెన్నైకి చెందిన ఎలంగో, నరేష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సత్యనారాయణపురం సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. మరో బాల నిందితుడిని జువైనల్ హోమ్‌కు తరలించగా, ఈ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు.

