ప్రశాంతంగా.. పర్యావరణహితంగా గణేష్ ఉత్సవాలు
పందిళ్ల ఏర్పాటులో భద్రతా ప్రమాణాలు తప్పనిసరి... డీజేలు, సౌండ్ సిస్టమ్స్ నిర్ణీత పరిమితుల్లోనే వినియోగించాలి... మట్టి వినాయక విగ్రహాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ డా. జి. లక్ష్మీశ పిలుపు...

విజయవాడ, సెప్టెంబరు 7: జిల్లాలో గణేష్ ఉత్సవాలను భక్తి ప్రపత్తులతో, ప్రశాంత వాతావరణంలో, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో గణేష్ ఉత్సవాల నిర్వహణ, విగ్రహాల ఏర్పాటు, పందిళ్ల అనుమతులు, విద్యుత్ భద్రత, అగ్నిమాపక చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన ఏర్పాట్లు, పారిశుద్ధ్యం తదితర అంశాలను కలెక్టర్ సమీక్షించారు.
గత ఏడాది జిల్లాలో ఐదు లక్షల మట్టి వినాయక విగ్రహాలను తయారు చేసి ప్రపంచ రికార్డు సాధించిన విషయాన్ని ప్రస్తావించిన కలెక్టర్, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా పర్యావరణహిత ఉత్సవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారైన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితం అయ్యే అవకాశం ఉన్నందున మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని సూచించారు.
పందిళ్ల ఏర్పాటుకు ముందుగానే సంబంధిత శాఖల అనుమతులు తీసుకోవాలని, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ, అగ్నిమాపక శాఖల అధికారులు సంయుక్తంగా పరిశీలించి భద్రతా ప్రమాణాలను ధ్రువీకరించాలని ఆదేశించారు. ప్రధాన రహదారులను పూర్తిగా లేదా పాక్షికంగా మూసివేసేలా పందిళ్లు ఏర్పాటు చేయరాదని స్పష్టం చేశారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు, ప్రమాదాలకు అవకాశం లేకుండా వైరింగ్, కనెక్షన్లు, విద్యుత్ పరికరాలను ముందస్తుగా తనిఖీ చేయాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సులభంగా బయటకు వెళ్లేందుకు మార్గాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
గణేష్ ఉత్సవాల్లో డీజేలు, సౌండ్ సిస్టమ్స్‌ను నిర్ణయించిన పరిమితులకు లోబడి మాత్రమే వినియోగించాలని కలెక్టర్ పేర్కొన్నారు. అధిక శబ్దంతో వృద్ధులు, చిన్నారులు, విద్యార్థులు, స్థానికులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నిమజ్జన ప్రాంతాలను ముందుగానే గుర్తించి క్రేన్లు, బోట్లు, డస్ట్‌బిన్లు తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పందిళ్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపట్టి వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని తెలిపారు.
ప్రసాదాల తయారీ, నిల్వ, పంపిణీలో ఆహార భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ హెచ్చరించారు. నాణ్యత లేని లేదా ఎక్కువ కాలం నిల్వ ఉంచిన ప్రసాదాల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఆహార తనిఖీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ, డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, విద్యుత్ శాఖ అధికారి యు. హనుమయ్య, అగ్నిమాపక శాఖ అధికారి ఏవి. శంకర్రావు, వివిధ శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.
