డీజేల మోతకు పోలీసుల చెక్
అనుమతి లేకుండా డీజేలు నిర్వహిస్తే సీజ్ చేస్తామని హెచ్చరిక గణేష్ ఉత్సవాల్లో డప్పులు, సన్నాయి వంటి సంప్రదాయ వాయిద్యాలకే ప్రాధాన్యం శబ్ద కాలుష్యం, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్న పెనమలూరు పోలీసులు

పెనమలూరు, సెప్టెంబరు 8: గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో డీజేల వినియోగంపై పెనమలూరు పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. అనుమతులు లేకుండా డీజేలను ఏర్పాటు చేయడం, అధిక శబ్దంతో సౌండ్ సిస్టమ్స్ వినియోగించడం వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే వాటిని సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పెనమలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో వినాయక మండపాల నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో సీఐ ఎన్. వెంకట నారాయణ భద్రతా నిబంధనలను వివరించారు. మండపాలకు ముందస్తు అనుమతులు తీసుకోవడంతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నిపుణులతో వైరింగ్ చేయించాలని సూచించారు. అగ్నిమాపక పరికరాలు, ఇసుక, నీరు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు.
విగ్రహాల ఊరేగింపుల్లో డీజేలకు బదులుగా డప్పులు, సన్నాయి వంటి సంప్రదాయ వాయిద్యాలను వినియోగించాలని పోలీసులు సూచించారు. మద్యం సేవించి ఊరేగింపుల్లో పాల్గొనడం, ఉద్రిక్తతలను రెచ్చగొట్టే పాటలు వినిపించడం, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం వంటి చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. రోగులు, వృద్ధులు, విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా నిర్దేశించిన సమయాలను పాటించాలని నిర్వాహకులను కోరారు.

