గుడివాడ మున్సిపల్ బరిలో మరీదు కరుణ!
ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, రావి సమక్షంలో నామినేషన్ పత్రాల అందజేత... సామాన్య కుటుంబానికి చెందిన తనకు అవకాశం కల్పించడంపై కరుణ కృతజ్ఞతలు... గుడివాడ అభివృద్ధే తన లక్ష్యమని వెల్లడి...

గుడివాడ, నవంబర్ 16: గుడివాడ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరీదు కరుణ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు రోడ్డులోని ప్రజావేదిక కార్యాలయంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ఆశీస్సులు తీసుకున్న మరీదు కరుణ, తన భర్త రోహిణితో కలిసి టీడీపీ బీ-ఫామ్ అందుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే రాము, రావి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులతో కలిసి ప్రచార రథంపై ఆర్డీవో కార్యాలయానికి బయలుదేరారు. ర్యాలీ మార్గంలో వ్యాపారులు, స్థానిక ప్రజలు స్వాగతం పలికారు. నెహ్రూ చౌక్ సెంటర్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఆర్డీవో జి. బాలసుబ్రహ్మణ్యంకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మరీదు కరుణ మాట్లాడుతూ సాధారణ కుటుంబానికి చెందిన తనకు ప్రజాసేవ చేసే అవకాశం కల్పించిన కూటమి నాయకత్వానికి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు కృతజ్ఞతలు తెలిపారు. నామినేషన్ ర్యాలీలో ప్రజలు చూపిన అభిమానం జీవితాంతం గుర్తుండిపోతుందన్నారు. ఎమ్మెల్యే రాము నాయకత్వంలో గుడివాడ పట్టణ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. చైర్‌పర్సన్‌గా తనను, కౌన్సిలర్లుగా కూటమి అభ్యర్థులను ఆదరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్, జనసేన ఇన్‌చార్జి బూరగడ్డ శ్రీకాంత్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు పండ్రాజు సాంబశివరావు, యలవర్తి శ్రీనివాసరావు, దింట్యాల రాంబాబు, లింగం ప్రసాద్, గోర్జీ సత్యనారాయణ, ఆగడాల సతీష్, సందు పవన్ తదితరులతో పాటు 48 వార్డుల కూటమి కౌన్సిలర్ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
