విజయవాడ సెంట్రల్ టీడీపీలో సస్పెన్షన్ల కలకలం!
క్రమశిక్షణ ఉల్లంఘనపై ఏడుగురు నేతలపై వేటు… మున్సిపల్ ఎన్నికల్లో రెబల్స్‌గా బరిలో దిగడంతో పార్టీ చర్యలు… కూటమి ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించారంటూ పార్టీ నుంచి సస్పెన్షన్…

విజయవాడ, అక్టోబర్ 24: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో సస్పెన్షన్లు కలకలం రేపాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నిర్ణయాలను ధిక్కరించి రెబల్ అభ్యర్థులుగా ఎన్నికల బరిలో నిలిచిన ఏడుగురు నాయకులపై తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు కూటమి ధర్మానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే కారణాలతో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వెల్లడించింది. సస్పెండ్ అయిన వారిలో కాకొల్లు మహేంద్రనాథ్ (బాబీ), దేవరపు మాల్యాద్రి, గేడ్డం శ్రీనివాసరావు, కోట నారాయణ, చంద్రశేఖర్, కొమ్మినేని సురేష్, మాదాల సత్యవతి ఉన్నారు. కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిలవడాన్ని పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే చర్యలను ఉపేక్షించేది లేదనే సంకేతాన్ని ఈ సస్పెన్షన్ల ద్వారా ఇచ్చింది.సస్పెండ్ చేసిన నాయకులకు ఇకపై తెలుగుదేశం పార్టీతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్న తరుణంలో ఈ పరిణామం విజయవాడ సెంట్రల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

