కృష్ణా జిల్లాలో జడ్పీటీసీ నామినేషన్ల జోరు!
26 స్థానాలకు 197 నామినేషన్లు దాఖలు… చివరి రోజే 115 నామినేషన్లు.. మచిలీపట్నం డివిజన్లో అత్యధికం… 67 నామినేషన్లతో టీడీపీ ముందంజ.. 64తో వైసీపీ తర్వాతి స్థానం…

కృష్ణా జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా ముగిసింది. జిల్లాలోని 26 జడ్పీటీసీ స్థానాలకు మొత్తం 197 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజులపాటు సాగిన నామినేషన్ల స్వీకరణలో చివరి రోజైన శుక్రవారం ఒక్కరోజే 115 నామినేషన్లు నమోదయ్యాయి. డివిజన్ల వారీగా మచిలీపట్నంలో అత్యధికంగా 100, గుడివాడలో 51, ఉయ్యూరులో 46 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీల వారీగా టీడీపీ నుంచి 67, వైఎస్సార్సీపీ నుంచి 64, జనసేన నుంచి 31, కాంగ్రెస్ నుంచి 12, బీజేపీ నుంచి 10, స్వతంత్రుల నుంచి 7, బీఎస్పీ నుంచి 4, సీపీఎం నుంచి 2 నామినేషన్లు నమోదయ్యాయి. టీడీపీ, వైసీపీ మధ్య నామినేషన్ల సంఖ్యలో కేవలం మూడింటి తేడా ఉండటం గమనార్హం. మండలాల వారీగా కృత్తివెన్నులో అత్యధికంగా 16 నామినేషన్లు దాఖలవగా, మొవ్వలో 12, మచిలీపట్నం సౌత్, నాగాయలంకలో చెరో 10 నమోదయ్యాయి. పామర్రు, ఉయ్యూరులో అత్యల్పంగా చెరో నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు కృత్తివెన్నులోనే 10 నామినేషన్లు నమోదైనట్లు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.

