వెదురు తోటలో వివాహిత దారుణ హత్య!
అటవీ ప్రాంతంలో కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యం… ఆసుపత్రికి వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరిన సంధ్యారాణి విగతజీవిగా ప్రత్యక్షం… మృతురాలిని రావులపర్రుకు చెందిన పలివెల సంధ్యారాణిగా గుర్తించిన పోలీసులు…

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నాచుగుంట రెవెన్యూ పరిధిలోని అటవీ ప్రాంతంలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. వెదురు తోటలో కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం లభ్యమవడంతో హత్య జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటవీ ప్రాంతంలో పనులకు వెళ్లిన కూలీలు మృతదేహాన్ని గుర్తించి అటవీ బీట్ అధికారి రాజేశ్‌కు సమాచారం అందించారు. ఆయన ఫిర్యాదు మేరకు చేబ్రోలు పోలీసులు రంగంలోకి దిగి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలిని రావులపర్రు గ్రామానికి చెందిన పలివెల సంధ్యారాణి (41)గా గుర్తించారు. సంధ్యారాణి తన భర్త శివ రామకృష్ణ ప్రసాద్‌తో కలిసి రావులపర్రులో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. వీరికి ఇంజినీరింగ్ చదువుతున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. శుక్రవారం తాడేపల్లిగూడెంలోని ఆసుపత్రికి వెళ్తానని ఇంటి నుంచి బయలుదేరిన సంధ్యారాణిని కుమారుడు ద్విచక్ర వాహనంపై ఉంగుటూరు జాతీయ రహదారి కూడలి వద్ద దించినట్లు సమాచారం. అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లాల్సిన ఆమె నాచుగుంట అటవీ ప్రాంతానికి ఎలా చేరుకున్నారన్నది మిస్టరీగా మారింది. సమాచారం అందుకున్న చేబ్రోలు ఎస్సై మామిడాల సూర్యభగవాన్ ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మహిళ మృతదేహం కాలిపోయిన స్థితిలో లభించడం, ఆసుపత్రికి వెళ్లాల్సిన ఆమె అటవీ ప్రాంతంలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇది హత్యా? మరేదైనా కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు జరగాల్సి ఉంది. అటవీ బీట్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

