ఐదు డివిజన్లలో ఏబీ ప్రచార హోరు!
రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్న నేతలు… 37 నుంచి 41వ డివిజన్ వరకు భారీ ర్యాలీ.. పూలతో స్వాగతించిన స్థానికులు… విజయవాడ కార్పొరేషన్‌కు పూర్వవైభవం తీసుకొస్తామని సీపీఐ నేత నారాయణ వెల్లడి…

విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ప్రజాసంఘాల మద్దతుతో మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శుక్రవారం నగరంలోని 37, 38, 39, 40, 41వ డివిజన్ల పరిధిలో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఊర్మిళనగర్‌లో ప్రారంభమైన ర్యాలీ ఐదు డివిజన్ల మీదుగా సాగింది. ద్విచక్ర వాహనాలతో కార్యకర్తలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలుచోట్ల స్థానికులు పూలు చల్లి స్వాగతించారు. ముఖ్యంగా 41వ డివిజన్ కబేళా సెంటర్, మసీదు ప్రాంతాల్లో ముస్లిం మైనారిటీలు ప్రచార వాహనంపై పూలు చల్లి మద్దతు తెలిపినట్లు నిర్వాహకులు వెల్లడించారు. విజయవాడకు పూర్వవైభవం తీసుకురావాలి: నారాయణ ర్యాలీలో పాల్గొన్న సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ మాట్లాడుతూ 1981లో సీపీఐ తరఫున టీవీ వెంకటేశ్వరరావు విజయవాడ తొలి మేయర్‌గా ఎన్నికై నగర అభివృద్ధికి కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన ప్రారంభించిన అభివృద్ధి పంథాను ఏబీ వెంకటేశ్వరరావు కొనసాగిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. నగర ప్రజల సమస్యలకు ప్రాధాన్యమిచ్చే ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు. డబ్బు రాజకీయాలకు దూరం: ఏబీ వెంకటేశ్వరరావు మేయర్ అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయం అంటే రౌడీయిజం కాదని, ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత అని పేర్కొన్నారు. డబ్బు, మద్యం పంపిణీ చేసే రాజకీయాలకు భిన్నంగా విలువలతో కూడిన రాజకీయాలను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. గ్యాస్ సిలిండర్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సీపీఎం నాయకులు సీహెచ్ బాబూరావు, వెంకటేశ్వరరావు, భూపతి రమణ, కాంగ్రెస్ నాయకులు కొలనుకొండ శివాజీ, నరహరశెట్టి నరసింహరావు, కార్పొరేటర్ అభ్యర్థులు బుద్ధే వేణుగోపాలరావు, సురసాని రామిరెడ్డి, పంచదార్ల దుర్గాంబ తదితరులు పాల్గొన్నారు.

