విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు!
బి.వి. సుబ్బారెడ్డి హైస్కూల్లో ఘనంగా బాలల దినోత్సవం... విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలి : కార్పొరేటర్ కాకొల్లు ఝాన్సీ... నూతన కార్పొరేటర్‌కు కేర్ టూ యాక్షన్ ప్రతినిధుల ఘన సన్మానం...

పాయకాపురం, నవంబర్ 14 : విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, తమ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని 86వ డివిజన్ కార్పొరేటర్ కాకొల్లు ఝాన్సీ పిలుపునిచ్చారు. శనివారం పాయకాపురంలోని బి.వి. సుబ్బారెడ్డి హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నూతన కార్పొరేటర్ కాకొల్లు ఝాన్సీ, కాకొల్లు హర్షసాయి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఝాన్సీ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు నైతిక విలువలను అలవర్చుకొని సమాజానికి ఉపయోగపడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమన్నారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఝాన్సీకి ఘన సన్మానం ఈ కార్యక్రమంలో ఇటలీకి చెందిన కేర్ టూ యాక్షన్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు ఎలిజబెట్టా జెగ్నా, మాసిమో, డైరెక్టర్ జనరల్ ఆంటోనియో బెంచి తదితరులు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్ కాకొల్లు ఝాన్సీని ఘనంగా సన్మానించారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఆమెను అభినందించారు. బాల్య జ్ఞాపకాలతో భావోద్వేగం ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ రాజకీయాల్లోకి వస్తానని తాను ఎప్పుడూ ఊహించలేదన్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్, వరలక్ష్మి దంపతుల ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి ప్రవేశించినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్పొరేటర్‌గా విజయం సాధించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజాప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బాలల దినోత్సవ వేడుకలకు హాజరుకావడం తన బాల్యాన్ని, విద్యాభ్యాసం నాటి జ్ఞాపకాలను గుర్తుచేసిందని చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, సలహాదారు కలామణి, డైరెక్టర్ వెంకటస్వామి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

