‘ఆర్నాబ్’ తుఫానుపై అప్రమత్తంగా ఉండాలి!– ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి – ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు… వరి కోతలు వాయిదా వేసుకోవాలి.. కోసిన పంటను భద్రపరచుకోవాలి… వరద ముంపు నివారణకు నాలుగు మండలాల అధికారులు సిద్ధంగా ఉండాలి…

గన్నవరం, అక్టోబర్ 26: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఆర్నాబ్’ తుఫాను తీవ్రరూపం దాల్చనున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సూచించారు. తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ప్రజలు నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవడంతోపాటు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. రైతులు వరి కోతలను వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే కోసిన ధాన్యం తడవకుండా భద్రపరచుకోవాలని తెలిపారు. పంట పొలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని నాలుగు మండలాల అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గ్రామాల్లో డ్రైనేజీలను శుభ్రపరచడంతోపాటు అవసరమైన ప్రాంతాల్లో మోటార్ల ద్వారా వరద నీటిని బయటకు తోడే ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. వాతావరణ శాఖ తాజా సమాచారం: అక్టోబర్ 28 ఉదయానికి బాపట్ల–విశాఖపట్నం మధ్య, యానాం సమీపంలో తుఫాను తీరం దాటే అవకాశం ఉందని, ఆ సమయంలో గంటకు 115–125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి, గరిష్ఠంగా 140 కిలోమీటర్ల వరకు పెరగవచ్చని కేంద్ర వాతావరణ శాఖ అంచనా వేసింది.

