సెంట్రల్‌లో హోరెత్తిన కూటమి ఎన్నికల ప్రచారం!
ఆరు డివిజన్లలో ఎన్డీఏ కూటమి నేతల విస్తృత పర్యటన… బొండా ఉమా, ఎంపీ కేశినేని చిన్ని, మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ ప్రచార హోరు… అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపు…

విజయవాడ, అక్టోబర్ 26: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం హోరెత్తింది. సోమవారం సాయంత్రం ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కూటమి మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ కలిసి ఆరు డివిజన్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 86వ డివిజన్ కండ్రిక సాయిబాబా ఆలయం వద్ద ప్రారంభమైన ప్రచారం కండ్రిక ప్రధాన రహదారి, జర్నలిస్టు కాలనీ, ఎన్టీఆర్ విగ్రహం, మాస్టర్ మైండ్ స్కూల్, వంగవీటి మోహన రంగా విగ్రహం మీదుగా సాగింది. అనంతరం 85వ డివిజన్ న్యూ రాజీవ్‌నగర్, ఓల్డ్ రాజీవ్‌నగర్, 84వ డివిజన్ ప్రజాశక్తినగర్, రాధానగర్ ప్రాంతాల్లో నాయకులు పర్యటించారు. అలాగే 83వ డివిజన్ సుందరయ్యనగర్ నుంచి ప్రకాష్‌నగర్ వరకు, 82వ డివిజన్ ప్రకాష్‌నగర్, శాంతినగర్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. 78వ డివిజన్ షాదీఖానా రోడ్డు, టీడీపీ కార్యాలయం రోడ్డు, వడ్డెర కాలనీ, దాబాకొట్లు ప్రాంతాల్లో ప్రచారం కొనసాగింది. ఈ సందర్భంగా బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ నగర సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనే కూటమి లక్ష్యమన్నారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విజయవాడ అభివృద్ధికి మరింత కృషి చేస్తామని తెలిపారు. మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని, కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల కార్పొరేటర్ అభ్యర్థులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

