సింగపూర్ సహకారంతో విద్యారంగానికి కొత్త దిశ!
ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ… డిజిటల్ గవర్నెన్స్, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకారానికి లోకేష్ ప్రతిపాదనలు… శిక్షణ ఫలాలు ప్రతి ఉపాధ్యాయుడికీ అందాలి.. ఆరు నెలలకోసారి పురోగతిపై సమీక్ష…

అమరావతి, నవంబర్ 12 : ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను పెంపొందించేందుకు సింగపూర్ ప్రభుత్వ సహకారాన్ని మరింత విస్తరించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ కోరారు. ఉపాధ్యాయులకు ఆధునిక బోధనా పద్ధతుల్లో శిక్షణతోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులకు నాయకత్వ లక్షణాలు, డిజిటల్ గవర్నెన్స్, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సింగపూర్ అనుభవాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అమరావతిలోని ఏపీసీఆర్డీఏ కార్యాలయంలో బుధవారం సింగపూర్–ఆంధ్రప్రదేశ్ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టాండింగ్ కమిటీ మూడో సమావేశం నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందం సింగపూర్ ప్రతినిధులతో పలు కీలక అంశాలపై చర్చించింది. శిక్షణ ఫలాలు అందరికీ చేరాలి ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రానికి చెందిన ఆరుగురు మంత్రులు, 37 మంది ఉపాధ్యాయులకు సింగపూర్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని వేసవి సెలవుల్లో సింగపూర్‌కు పంపించి అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతుల్లో శిక్షణ ఇప్పించాలని సూచించారు. అక్కడ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు తిరిగి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని ఇతర ఉపాధ్యాయులకు ఆ పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు. ఇందుకోసం స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను వినియోగించుకోవాలని, శిక్షణ కొద్దిమందికే పరిమితం కాకుండా విద్యావ్యవస్థ మొత్తానికి ప్రయోజనం చేకూర్చాలని స్పష్టం చేశారు. మంత్రులు, కార్యదర్శులకు సంయుక్త శిక్షణ సింగపూర్ సహకారంతో అమలు చేస్తున్న సేజ్ కార్యక్రమం కింద మంత్రులు, సంబంధిత శాఖల కార్యదర్శులకు ఒకేసారి శిక్షణ అందించడం ద్వారా పాలనలో సమన్వయం పెరుగుతుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానాల రూపకల్పన నుంచి అమలు వరకు మరింత సమర్థంగా పనిచేసేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు. సివిల్ సర్వెంట్లకు నాయకత్వ నైపుణ్యాలు, ఆధునిక పరిపాలనా విధానాలు, సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. డిజిటల్ పాలనలో సింగపూర్ సహకారం రియల్ టైమ్ గవర్నెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, సమీకృత డిజిటల్ వేదికలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ల నిర్వహణ, డేటా ఆధారిత నిర్ణయాల విషయంలో సింగపూర్ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని మంత్రి ప్రతిపాదించారు. రాష్ట్రంలో వరుస తుఫానుల కారణంగా కొన్ని కార్యక్రమాల అమలులో జాప్యం జరిగినప్పటికీ, వాటిని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. అమరావతిని ఆధునిక, సుస్థిర రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్, సింగపూర్ ప్రభుత్వాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలోని అంశాల అమలును కూడా సమావేశంలో సమీక్షించారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల పురోగతిపై చర్చించారు. ఇకపై ప్రతి ఆరు నెలలకోసారి కార్యక్రమాల అమలును సమీక్షించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక నోడల్ అధికారిని నియమించినట్లు అధికారులు వివరించారు. రెండు ప్రభుత్వాల మధ్య మరింత సహకారం ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదనలపై సింగపూర్ ప్రతినిధి బృందం సానుకూలంగా స్పందించింది. విద్య, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ పరిపాలన, నాయకత్వ శిక్షణ వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తరించే అంశాలపై చర్చించింది. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పీయూష్ కుమార్, జి.జయలక్ష్మి, ఏపీసీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ భరత్ గుప్తా, స్కిల్ డెవలప్మెంట్ ఎండీ గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సింగపూర్ ప్రతినిధి బృందానికి గన్ సియో హువాంగ్ నేతృత్వం వహించారు. సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య, పరిశ్రమల శాఖల ప్రతినిధులు, చెన్నైలోని సింగపూర్ కాన్సుల్ జనరల్ విలియం చిక్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

