విశాఖ అభివృద్ధికి కృషి చేయాలి!
మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన మేయర్ ముక్కా శ్రావణి… మేయర్‌గా ఎన్నికైన శ్రావణికి అభినందనలు తెలిపిన మంత్రి లోకేష్… రాబోయే 23 మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులకు కీలక బాధ్యతలు…

విశాఖపట్నం, నవంబర్ 12 : విశాఖపట్నం నూతన మేయర్ ముక్కా శ్రావణి రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖలో నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు బుధవారం నగరానికి చేరుకున్న మంత్రి లోకేష్‌ను సాయంత్రం ఆమె కలుసుకున్నారు. ఇటీవల జరిగిన విశాఖ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన శ్రావణిని ఈ సందర్భంగా లోకేష్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి బలమైన కంచుకోట అని మేయర్ ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయని లోకేష్ పేర్కొన్నారు. ప్రజలు కూటమిపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పనిచేయాలని సూచించారు. నగర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగించాలని మేయర్‌కు సూచించారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న 23 మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై కూడా మంత్రి లోకేష్ స్పందించారు. ఆయా ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేసే బాధ్యతలను ఇటీవల ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో ముందుకు సాగాలని, ప్రజలతో నిరంతరం మమేకమవుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

