కోలుకుంటున్న గోపిక.. నెమ్మదిగా అడుగులు!
స్వయంగా శ్వాస తీసుకుంటున్న రాప్తాడు దాడి బాధితురాలు… వైద్య సిబ్బంది సాయంతో నడక.. కొనసాగుతున్న ఫిజియోథెరపీ… ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న మంత్రి సత్యకుమార్ యాదవ్…

అమరావతి, నవంబర్ 12 : అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎలక్ట్రిక్ రంపంతో జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపిక ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోంది. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపిక ప్రస్తుతం వైద్య సిబ్బంది సహాయంతో నెమ్మదిగా అడుగులు వేస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గోపిక ప్రస్తుతం స్వయంగా శ్వాస తీసుకుంటోందని, రాత్రివేళ నిద్రలో మాత్రమే స్వల్పంగా ఆక్సిజన్ సాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. శరీర కదలికలు సాధారణ స్థితికి చేరుకునేందుకు వైద్యులు ఫిజియోథెరపీ కొనసాగిస్తున్నారని వివరించారు. వైద్య సిబ్బంది పర్యవేక్షణలో బాధితురాలు నెమ్మదిగా నడవగలుగుతోందని పేర్కొన్నారు. దాడిలో ముఖంపై ఏర్పడిన గాయాలకు వేసిన కుట్లను వైద్యులు తొలగించారని, ఇతర గాయాలకు చికిత్స కొనసాగుతోందని తెలిపారు. గోపిక ప్రస్తుతం మెత్తటి ఆహారాన్ని నోటి ద్వారా స్వయంగా తీసుకుంటోందన్నారు. రక్తపోటుతో పాటు ఇతర ఆరోగ్య సూచీలు నిలకడగా ఉన్నట్లు మణిపాల్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారని మంత్రి పేర్కొన్నారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన గోపిక క్రమంగా కోలుకుంటుండటం ఊరటనిచ్చే పరిణామంగా మారింది. పూర్తిస్థాయిలో కోలుకునే వరకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స, ఫిజియోథెరపీ కొనసాగనున్నాయి.

