రాప్తాడు రంపం కేసు నిందితుడి ఆరోగ్యం విషమం!
హేమంత్‌కు పల్మనరీ ఎంబాలిజం సమస్య… ఇప్పటికే కుడికాలు తొలగించిన వైద్యులు… శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు.. ప్రత్యేక చికిత్స…

అనంతపురం, నవంబర్ 12 : రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై ఎలక్ట్రిక్ రంపంతో దాడికి పాల్పడిన కేసులో నిందితుడు హేమంత్ ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హేమంత్‌కు తాజాగా పల్మనరీ ఎంబాలిజం సమస్య తలెత్తినట్లు వైద్యులు నిర్ధారించారు. ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఏర్పడే ఈ సమస్య ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. పోలీసుల కాల్పుల్లో గాయపడిన హేమంత్ కుడికాలికి రక్తప్రసరణ నిలిచిపోవడంతో కణజాలం దెబ్బతింది. దీంతో వైద్యులు ఇటీవల శస్త్రచికిత్స నిర్వహించి అతడి కుడికాలిని తొలగించారు. అప్పటి నుంచి అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల క్రితం హేమంత్‌కు అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఈ క్రమంలో మంచంపై నుంచి కిందపడిపోవడంతో వైద్యులు సీటీ స్కాన్ నిర్వహించారు. పరీక్షల్లో పల్మనరీ ఎంబాలిజం ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడికి ప్రత్యేక చికిత్స ప్రారంభించారు. శస్త్రచికిత్సల అనంతరం ఎదురయ్యే తీవ్రమైన సమస్యల్లో పల్మనరీ ఎంబాలిజం ఒకటని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలోని రక్తనాళాల్లో ఏర్పడిన గడ్డలు ఊపిరితిత్తులకు చేరి రక్తప్రసరణను అడ్డుకుంటే గుండెపై తీవ్రమైన ఒత్తిడి ఏర్పడుతుందని వివరించారు. సకాలంలో చికిత్స అందకపోతే ప్రాణాపాయం సంభవించే అవకాశముందని తెలిపారు. ప్రస్తుతం హేమంత్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షిస్తోంది.

