జనసేన ఆఫీస్ పేరుతో రూ.7 కోట్ల మోసం?
ఉద్యోగాల పేరుతో 20 మంది నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు… ఏలూరు, తణుకు ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపినట్లు ఫిర్యాదు… జనసేన నేతల పేర్లను ఉపయోగించుకున్నట్లు ఆరోపణ.. మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు…

మంగళగిరి, నవంబర్ 12 : జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయం పేరుతో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. ఏలూరు, తణుకు ప్రాంతాలకు చెందిన సుమారు 20 మంది నుంచి రూ.7 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ధరణి అనే వ్యక్తిపై ఆరోపణలు రావడంతో జనసేన నాయకులు మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. జనసేన నాయకులు శివ శ్రీనివాస్, కోట రుక్మిణి పేర్లను ఉపయోగించుకుని ధరణి అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మించినట్లు ఫిర్యాదులో ఆరోపించినట్లు సమాచారం. జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం జనసేన నాయకుల దృష్టికి రావడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. పార్టీ కార్యాలయం, నాయకుల పేర్లను ఉపయోగించుకుని జరిగినట్లు చెబుతున్న ఈ వ్యవహారంపై వాస్తవాలను వెలికితీయాలని కోరినట్లు సమాచారం. అయితే రూ.7 కోట్ల వసూళ్లు, బాధితుల సంఖ్య, నగదు లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల అధికారిక దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ ఆరోపణలపై ధరణి వివరణ కూడా తెలియాల్సి ఉంది.

