గంజాయిపై నిఘా.. సమాచారానికి నగదు బహుమతి!
సేవించే వారి సమాచారం ఇస్తే రూ.1,500 బహుమతి... విక్రయాలు, అక్రమ రవాణా వివరాలకు రూ.5 వేల రివార్డు... ‘ఈగల్ ఛాలెంజ్’తో మత్తుపై ఎన్టీఆర్ జిల్లా పోలీసుల ఉక్కుపాదం...

విజయవాడ: గంజాయి, ఇతర మత్తు పదార్థాల కట్టడికి ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ‘ఈగల్ ఛాలెంజ్’ కార్యక్రమంతో ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. గంజాయి సేవిస్తున్న వారి గురించి కచ్చితమైన సమాచారం అందిస్తే రూ.1,500, గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం ఇస్తే రూ.5,000 బహుమతి అందించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో పోలీసులతో పాటు ఈగల్ బృందాలు సమన్వయంతో పనిచేయనున్నాయి. ఇప్పటికే గంజాయి వినియోగంతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 1,287 మందిని గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. యువతను మత్తు బారి నుంచి కాపాడటమే లక్ష్యంగా ప్రత్యేక నిఘాతో ముందుకు సాగుతున్నారు.
ముఖ్యంగా యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని మత్తు పదార్థాలను విక్రయించే వారిపై దృష్టి సారిస్తున్నారు. విద్యాసంస్థల పరిసరాల్లో నిఘాను మరింత పటిష్ఠం చేసి, మత్తు పదార్థాల సరఫరా గొలుసును గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించనున్నారు.
గంజాయి విక్రేతలు, అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. యువత మత్తుకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయాలు లేదా వినియోగంపై విశ్వసనీయ సమాచారం ఉన్నవారు పోలీసులకు తెలియజేసి మత్తు రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు.

