ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద కాంగ్రెస్ ఆందోళన
ప్రధాన ద్వారానికి కాంగ్రెస్ కండువాలతో తాళం... సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ పోస్టర్లు... కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. భారీ పోలీసు బందోబస్తు...

విజయవాడ, సెప్టెంబర్ 28: ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ సూచనలతో కాంగ్రెస్ నాయకుడు జీవీ శ్రీరాజ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. నిరసనలో భాగంగా కార్యాలయ ప్రధాన ద్వారానికి కాంగ్రెస్ కండువాలతో తాళం వేసి తమ నిరసన తెలిపారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ద్వారానికి పోస్టర్లు అంటించారు. దీంతో కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత దెబ్బతింటోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పునరుద్ధరించి, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు.

