గోదావరి పుష్కరాలకు రూ.210 కోట్లు
‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్’ కింద నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం 238 పాత, కొత్త పుష్కరఘాట్ల అభివృద్ధికి ప్రణాళిక ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా తరహాలో పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు

అమరావతి: 2027లో నిర్వహించనున్న గోదావరి మహా పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ‘అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్’ కింద రూ.210 కోట్లను మంజూరు చేసింది. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నిధులతో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని మొత్తం 238 పాత, కొత్త పుష్కరఘాట్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. భక్తులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఘాట్లను ఆధునీకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన మహాకుంభమేళా తరహాలో గోదావరి మహా పుష్కరాలను భారీ స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని పుష్కరఘాట్లను ఆధునీకరించడంతో పాటు గోదావరి నదీ తీరాలను సుందరంగా తీర్చిదిద్దనున్నారు. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, పుష్కర స్నానాలకు అవసరమైన వసతులు కల్పించే దిశగా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

