విద్యా హక్కుల కోసం మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కావాలి: ఏఐఎస్ఎఫ్
ఘనంగా ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం విద్యార్థి సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని డిమాండ్ విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలి

విజయవాడ: విద్యార్థుల విద్యా హక్కుల సాధన కోసం మరో స్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) నాయకులు పిలుపునిచ్చారు. ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక దాసరి భవన్ వద్ద కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మాజీ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు సంఘం పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1936 ఆగస్టు 12న లక్నోలో ఆవిర్భవించిన ఏఐఎస్ఎఫ్కు 91 ఏళ్ల విద్యార్థి ఉద్యమ చరిత్ర ఉందన్నారు. విద్యార్థుల హక్కులు, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, శాస్త్రీయ విద్య కోసం నిరంతరం పోరాడుతూ వస్తోందన్నారు. బ్రిటిష్ పాలనలోనే విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలు నిర్వహించడంతో పాటు స్వాతంత్ర్య పోరాటంలో విద్యార్థులను చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం అనంతరం కూడా విద్య అందరికీ అందుబాటులో ఉండాలని, పేద విద్యార్థులకు విద్యావకాశాలు కల్పించాలని, విద్యా రంగంలోని అసమానతలను తొలగించాలని అనేక ఉద్యమాలు నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థుల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ ఏఐఎస్ఎఫ్ పోరాటం ఉంటుందని స్పష్టం చేశారు. ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యా హక్కుల కోసం ప్రశ్నించే విద్యార్థులపై దాడులు, అణచివేత చర్యలు సరికావన్నారు. విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వాలు గౌరవించాలని, వారి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఎన్నికలను నిర్వహించి విద్యార్థులకు ప్రజాస్వామ్యబద్ధమైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. దేశంలో విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంతో పాటు ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన ఉచిత విద్య అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, పరీక్షలు, నియామక ప్రక్రియల్లో పారదర్శకత పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. యుగంధర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంక గోవిందరాజులు, ఏఐటీయూసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. సాయికుమార్, ఎన్టీఆర్ జిల్లా నాయకుడు ఉమాకాంత్, విజయవాడ నగర అధ్యక్ష, కార్యదర్శులు రంజిత్, జగదీష్‌తో పాటు రాజు, దీపక్, యశ్వంత్, చంటి, షణ్ముఖ ప్రియ, దివ్య, శిరీష, రజియా తదితరులు పాల్గొన్నారు.

