జాతీయ సమైక్యతకు ప్రతీకగా విజయవాడలో భారీ ర్యాలీ
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని సమైక్యతా ర్యాలీ… పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో ఎంజీ రోడ్డుపై ర్యాలీ… పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థుల ఉత్సాహభరిత భాగస్వామ్యం…

విజయవాడ, అక్టోబర్ 30: జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం విజయవాడలో సమైక్యతా ర్యాలీ నిర్వహించారు. భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి, ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని దేశ ఐక్యత, సమగ్రతను చాటిచెప్పేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖరబాబు నేతృత్వంలో వ్యాస్ కాంప్లెక్స్‌లోని దివంగత కె.ఎస్. వ్యాస్ విగ్రహం వద్ద ప్రారంభమైన ర్యాలీ ఎంజీ రోడ్డు మీదుగా డీ అడ్రస్ మాల్ వరకు కొనసాగింది. పోలీసు అధికారులు, సిబ్బందితోపాటు వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ర్యాలీలో పాల్గొని జాతీయ సమైక్యతా స్ఫూర్తిని చాటారు. దేశంలోని సంస్థానాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించిన చారిత్రక పాత్రను స్మరించుకునేలా ర్యాలీ నిర్వహించారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశ గొప్పతనమనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశంగా నిలిచింది. ఈ ర్యాలీలో డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, తిరుమలేశ్వరరెడ్డి, షిరిన్ బేగం, కె.జి.వి. సరిత, ఏ.బి.టి.ఎస్. ఉదయారాణి, కృష్ణప్రసన్నతోపాటు అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
