78వ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి కనకదుర్గ ఇంటింటి ప్రచారం
హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి… దోమలు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ… మహిళలకు ఉపాధి అవకాశాలు, నూతన బస్ షెల్టర్ల ఏర్పాటుకు కృషి చేస్తానని వెల్లడి…

విజయవాడ, అక్టోబర్ 30: విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారం చివరి రోజు సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలోని 78వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి వేముల కనకదుర్గ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. డివిజన్లోని పలు ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కనకదుర్గ మాట్లాడుతూ డివిజన్లో పేరుకుపోయిన ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కార్పొరేటర్‌గా అవకాశం కల్పిస్తే దోమల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన మురుగునీరు, పిచ్చి మొక్కలను తొలగించడంతోపాటు సైడ్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానన్నారు. డివిజన్లోని మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా నూతన బస్ షెల్టర్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కార్యరూపంలోకి తీసుకురావడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎన్ఎస్యూఐ రాష్ట్ర కోఆర్డినేటర్ వేముల శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తుల అంకమ్మరాజు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి నాగెళ్ల కిషోర్, మామిడాల రమణ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేముల దుర్గారావు, వేముల సుబ్రహ్మణ్యం, శేఖర్, లక్ష్మణరావు, మురళి, బాలు, రాయప్ప, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

